ముఖ్య సమాచారం
-
అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేత... నోటమ్ జారీ!
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
-
గుడివాడ అభివృద్ధికి రూ.136 కోట్ల నిధులు మంజూరు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
భారీ వర్షాలు.. 56 మంది మృతి
-
హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు
-
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
-
ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.*
-
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు...
-
హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్: అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్!
Updated on: 2025-05-22 11:28:00

ఏపీలో మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఐదుగురు కీలక వ్యక్తులు దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం. వీరిలో నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, మరొకరు థాయిలాండ్‌లో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి, అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల వద్ద సీబీఐ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అయితే, విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన బూనేటి చాణక్య అనే వ్యక్తిని ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
తిరుపతికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. రాజ్ కెసిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఆయన ఏకంగా ఎనిమిది డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి డైరెక్టర్‌గా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విదేశాలకు తరలించడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. టెక్కార్ ఇన్నోవేషన్స్, ఎయిర్‌ఆర్క్ స్పేస్ టెక్నాలజీస్, టెక్సి స్మార్ట్ మొబిలిటీ వంటివి ఏర్పాటు చేసిన కొన్ని డొల్ల కంపెనీలుగా అధికారులు గుర్తించారు.
శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్.. రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసి, వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు, అమ్మకాల వివరాలు, ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం రావాలనే లెక్కలన్నీ ఆయన వద్దే ఉండేవని తెలుస్తోంది. ఫ్లై పిజియాన్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీకి సైఫ్ అహ్మద్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
హైదరాబాద్‌కు చెందిన బూనేటి చాణక్య.. రాజ్ కెసిరెడ్డి ముఠా ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించినట్లు ఆరోపణలున్నాయి. అక్రమ నగదు వసూళ్లలో ఇతను కూడా కీలక పాత్రధారి అని, ఆస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పీ, వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ వంటి డొల్ల కంపెనీలతో ఇతనికి సంబంధాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.సికింద్రాబాద్‌కు చెందిన పురుషోత్తం వరుణ్‌కుమార్.. లీలా డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్ హెడ్‌గా వ్యవహరిస్తూ, సబ్‌లీజులు, ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు చూసుకున్నట్లు తెలుస్తోంది.
బొల్లారం శివకుమార్, అదాన్ డిస్టిలరీ డైరెక్టర్‌గా ఉంటూ సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీగా అమ్మకాలు జరిపి, ముడుపులు పంపిణీ చేసినట్లు సమాచారం. వైట్ డీర్ స్పిరిట్స్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ, అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలతో ఇతనికి సంబంధాలున్నాయి.
ఇక, రాజ్ కెసిరెడ్డి తోడల్లుడైన అవినాశ్ రెడ్డి (సుమిత్), మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు, అదాన్ డిస్టిలరీ కార్యకలాపాల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ అనే డొల్ల కంపెనీతో ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు.